సినిమా ఆగిపోయింద‌నే వార్త‌ల‌ని కొట్టిపారేసిన నిర్మాత‌

న‌టుడిగా రాణిస్తున్న అవ‌స‌రాల శ్రీనివాస్ అప్పుడప్పుడు ద‌ర్శ‌కుడిగాను త‌న ప్ర‌తిభ‌ను చాటుకుంటూ ఉంటాడు. ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారిన అవ‌స‌రాల త‌న‌ రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా చేశాడు. ఈ సినిమా డివైడ్ టాక్ రావ‌డంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు నాగ‌శౌర్య‌తో క‌లిసి ఓ చిత్రం చేస్తున్నాడు.  పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మొద‌లై చాలా రోజులే అవుతున్న‌ప్ప‌టికీ, ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌డంతో ప్రాజెక్ట్ ఆగిపోయింద‌నే పుకార్లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. దీనిపై తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. 


‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్‌ 50 శాతం పూర్తయింది.  మిగతా షూటింగ్‌ యూఎస్‌ఏలో ప్లాన్‌ చేశాం. వీసాల కోసం వేచి చూస్తున్నాం.  సినిమా చాలా అద్భుతంగా రూపొందుతోంది. యూఎస్‌ఏ షెడ్యూల్‌ కూడా త్వరగానే పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి. పుకార్లను నమ్మకండి’అంటూ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత వివేక్ కూచిభొట్ల ట్వీట్‌ చేశారు. కాగా, నాగ‌శౌర్య ఇటీవ‌ల అశ్వ‌థ్థామ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌గా, ప్ర‌స్తుతం అవ‌స‌రాల ప్రాజెక్ట్‌తో పాటు లక్ష్మీసౌజన్య అనే కొత్త దర్శకురాలితో మరో సినిమాను   చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.