కరోనా వైరస్ (కోవిడ్-19)నేపథ్యంలో ఢిల్లీలో మార్చి 31వరకు రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ సీఎం కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..రెస్టారెంట్లలో భోజనం చేయడంపై నిషేధం అమలులో ఉంటుంది. అయితే ఆహారం తీసుకెళ్లడం, ఫుడ్‌డెలివరీ కొనసాగుతుందని తెలిపారు.
సభలు, సమావేశాలు, సదస్సులు, ఇతర సామాజికకార్యక్రమాల్లో 20 మంది లేదా ఆపైన ఒక్కచోట ఉండేందుకు అనుమతి లేదని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. విదేశాల నుంచి ఇండియాకు వచ్చినవారికి హోం క్వారంటైన్ స్టాంప్ వేయడం ప్రారంభించాం. కొంతమంది నేరుగా సూచనలు, నిబంధనలు పాటించకుండా ఇంటికెళ్లిపోతున్నారు. హోం క్వారంటైన్ అవసరమైన వారు పాటించకపోతే వారిని బలవంతంగా అరెస్ట్ చేసి..కేసు నమోదు చేస్తామన్నారు.