లాక్‌డౌన్‌ పిరియడ్‌ను పొడిగించిన ఒడిశా

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పిరియడ్‌ను పొడిగించింది. ఈ నెల 14 వరకు ఉన్న లాక్‌డౌన్‌ పిరియడ్‌ను మరో 15 రోజులు పెంచుతూ ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన ఐదుగురు సీనియర్‌ మంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి ఆమోదం తెలుపుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. 


కోవిడ్‌-19పై పోరాటానికి, కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ పిరియడ్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. ఒడిశాలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్నట్లు వెల్లడించారు. కోవిడ్‌-19పై పోరాటంలో ప్రజల క్రమశిక్షణ, త్యాగం తమకు మరింత బలాన్ని ఇస్తుందని అన్నారు. రాష్ర్టానికి విమాన, రైలు సర్వీసులను నడుపొద్దని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లుగా తెలిపారు. అదేవిధంగా ఒడిశా వ్యాప్తంగా జూన్‌ 17 వరకు అన్ని విద్యాసంస్థలు బంద్‌ పాటించనున్నట్లు పేర్కొన్నారు. కాగా దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం ఒడిషాగా నిలిచింది.